లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి లో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. గతంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని అనూహ్యంగా ఆలింగనం చేసుకున్న ఘటనను గుర్తు చేశారు. మోదీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని వచ్చిన రాహుల్, తన సీట్లో కూర్చున్న తర్వాత తోటి కాంగ్రెస్ ఎంపీలను చూసి కళ్లెగరేశారని రిజిజు విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన నేతను ఎప్పుడూ చూడలేదని ఆయన ఎద్దేవా చేశారు.
కిరణ్ రిజిజు చేసిన విమర్శలపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. గత పన్నెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి దీటుగా నిలబడి పోరాడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆమె ధీటుగా సమాధానం ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం గొంతుక వినిపిస్తున్న నాయకుడిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆమె హితవు పలికారు. సభలో చర్చ స్పీకర్‌పై అవిశ్వాసం గురించి జరగాల్సి ఉండగా, పాత విషయాలను తీసుకువచ్చి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చర్చా కార్యక్రమం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒకవైపు ప్రభుత్వం తన పనితీరును సమర్థించుకోగా, మరోవైపు ప్రతిపక్షాలు స్పీకర్ నిర్ణయాలను, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాయి. కిరణ్ రిజిజు మరియు ప్రియాంక గాంధీ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సభా మర్యాదలు, గత అనుభవాలను ప్రస్తావిస్తూ ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.








