దాదాపు మూడేళ్ల పాటు దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు పూర్తి విముక్తి కల్పించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సరైన ఆధారాలు లేవని, మనీ ట్రయల్ జరిగినట్లు సాక్ష్యాలు దొరకలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలపై ఉన్న ఆరోపణలన్నీ నీటి బుడగలా పేలిపోయాయి. “సత్యమే గెలుస్తుందని నాకు తెలుసు, ఈ రెండున్నరేళ్ల వేధింపులకు ఈ తీర్పే సమాధానం” అని కవిత ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే, ఈ తీర్పు కేవలం వ్యక్తిగత ఊరట మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. తన అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మరియు అధినేత కేసీఆర్ సరైన రీతిలో స్పందించలేదని కవిత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీకి, తండ్రికి మధ్య దూరం పెరిగిందని, ఆమె త్వరలోనే సొంత పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కొత్త రాజకీయ ప్రస్థానానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
మరోవైపు, కవితకు క్లీన్ చిట్ లభించడం కాంగ్రెస్ పార్టీకి కొత్త అవకాశాలను కల్పిస్తోంది. కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచేందుకు కవితతో పొత్తు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేసే అవకాశం ఉంది. కవిత కొత్త పార్టీ పెడితే, కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ-బీఆర్ఎస్ కూటమిపై ఉమ్మడి దాడి చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కవిత తదుపరి అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.








