ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులపై అత్యంత కీలకమైన ప్రసంగం చేశారు. ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయవద్దని కోరారు. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి వరద జలాలను మాత్రమే తాము వాడుకుంటున్నామని, దీనివల్ల పొరుగు రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమేనని ఆయన వివరించారు.
గంగా-కావేరి నదుల అనుసంధానం తన జీవితకాల స్వప్నమని పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేసి జల కరువును శాశ్వతంగా పారద్రోలడమే తమ లక్ష్యమని తెలిపారు. గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో విఫలమైందని విమర్శిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని గుర్తు చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 100 టీఎంసీల నీటిని తరలించిన ఘనత తమదేనని ఆయన ఉద్ఘాటించారు.
పరిపాలనలో జవాబుదారీతనం గురించి ప్రస్తావిస్తూ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 14 వారాల గడువు విధించినట్లు వెల్లడించారు. వచ్చే జూలై నాటికి వెలిగొండ ఫేజ్-1 నుంచి నీటి విడుదల జరుగుతుందని, ప్రతి వారం పనుల పురోగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రాయలసీమకు శ్రీశైలం ద్వారా నీటిని అందించడంతో పాటు, ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న 11 ప్రాజెక్టులను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఆ అద్భుత నిర్మాణాన్ని స్వయంగా చూడాలని ఆయన సూచించారు.








