అక్రమ వలసదారులను ఏరివేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జనవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, అమెరికాలో పట్టుబడిన వారిని వారి స్వదేశాలకు కాకుండా గ్వాటమాలా, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి మూడో దేశాలకు (Third Countries) తరలించాలని ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను మసాచుసెట్స్‌లోని ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. ఈ తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్ఫీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విధానం హోమ్‌లాండ్ సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస సమయం కేటాయించకుండా వారికి సంబంధం లేని దేశాలకు పంపడం అన్యాయమని కోర్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల వారి ప్రాణాలకు, స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేవలం జాతి, మతం లేదా రాజకీయ అభిప్రాయాల ఆధారంగా వలసదారులను ఇతర దేశాలకు తరలించడం అమెరికా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని తీర్పులో వెల్లడించారు.
ఈ తీర్పు ట్రంప్ యంత్రాంగానికి గట్టి హెచ్చరికగా నిలిచింది. అమెరికా గడ్డపై ఉన్న ఏ వ్యక్తికైనా సరైన చట్టపరమైన ప్రక్రియ లేకుండా వారి హక్కులను కాలరాయడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రతీకార సుంకాల విషయంలో సుప్రీంకోర్టు నుంచి షాక్ తిన్న ట్రంప్‌కు, ఇప్పుడు వలసల విషయంలో ఫెడరల్ కోర్టు తీర్పు మరో అడ్డంకిగా మారింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానం 15 రోజుల సమయం ఇచ్చింది.








