AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: ఉచిత ప్రమాద బీమా రూ. 1.2 కోట్లు, సహజ మరణానికి రూ. 10 లక్షల పరిహారం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే భారీ ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం కింద విధి నిర్వహణలో లేదా ఇతరత్రా ప్రమాదవశాత్తు మరణిస్తే సదరు ఉద్యోగి కుటుంబానికి రూ. 1.2 కోట్ల భారీ పరిహారం అందనుంది. అలాగే, 60 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగులు సహజంగా మరణించినా, వారికి రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా రూ. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7.57 లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. కేవలం బీమా మాత్రమే కాకుండా, ఉద్యోగులందరికీ డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సుమారు 1,998 రకాల వ్యాధులకు నగదు రహిత (Cashless) చికిత్స పొందే వెసులుబాటు కలుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయనున్నారు.

ఈ ఆరోగ్య పథకం నిర్వహణ కోసం ఉద్యోగుల ప్రాథమిక వేతనం (Basic Pay) నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ చేయబడుతుంది. ఉద్యోగుల వాటాగా వచ్చే రూ. 528 కోట్లకు సమానంగా ప్రభుత్వం కూడా తన వంతు నిధులను ట్రస్టు ఖాతాలో జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఈహెచ్ఎస్ (EHS) అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి

ANN TOP 10