AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు షాక్: రూ. 782 కోట్ల బకాయిల కోసం ఆస్తుల వేలం!

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు ఆమె భర్త నీలకంఠ శివ బుట్టాకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) భారీ షాక్ ఇచ్చింది. గతంలో తమ వ్యాపార అవసరాల కోసం తీసుకున్న సుమారు రూ. 340 కోట్ల రుణం, వడ్డీతో కలిపి ఇప్పుడు రూ. 782.07 కోట్లకు చేరుకుంది. గత ఐదేళ్లుగా ఈ బకాయిలు చెల్లించకపోవడంతో, తాకట్టు పెట్టిన విలువైన ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ సంస్థ నిర్ణయించింది.

ఈ వేలం జాబితాలో ప్రధానంగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు ఉన్నాయి. కేపీహెచ్‌బీ (KPHB) ఫేజ్-6లో ఉన్న సుమారు 3,833 చదరపు గజాల స్థలాన్ని విక్రయానికి ఉంచారు, ప్రస్తుతం ఇక్కడే ప్రముఖ విద్యాసంస్థ ‘మెరిడియన్ స్కూల్’ నడుస్తోంది. ఈ స్కూల్ భవనానికి రిజర్వు ధరగా రూ. 65 కోట్లు నిర్ణయించారు. వీటితో పాటు మాదాపూర్, ఖానామెట్ పరిసరాల్లోని ఇతర విలువైన స్థలాలు కూడా ఈ వేలంలో ఉన్నాయి.

ఈ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు మార్చి 23వ తేదీ వరకు ఈ-బిడ్ ఫారాలను సమర్పించవచ్చు. మార్చి 24న ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనున్నట్లు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ ప్రకటించింది. 2014లో కర్నూలు ఎంపీగా గెలిచి, రాజకీయంగా మరియు వ్యాపారపరంగా ఎంతో పలుకుబడి ఉన్న బుట్టా కుటుంబం, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభం చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10