సాధారణంగా పండుగ బోనస్‌లు లేదా చిన్నపాటి బహుమతులు ఇచ్చే కంపెనీలకు భిన్నంగా, కేరళకు చెందిన హైలైట్ గ్రూప్ (HiLITE Group) తన ఉద్యోగులకు కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చింది. సంస్థ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కంపెనీ అభివృద్ధిలో అహర్నిశలు శ్రమించిన 47 మంది ఉద్యోగులకు ఏకంగా రూ. 20 కోట్ల విలువైన లగ్జరీ కార్లను బహుమతిగా అందజేసింది. కాలికట్‌లో నిర్వహించిన సంస్థ 30వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఖరీదైన కార్ల కీలను యాజమాన్యం సిబ్బందికి అందజేసి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ బహుమతులలో సాదాసీదా కార్లు కాకుండా.. ప్రపంచ స్థాయి బ్రాండ్లైన రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఆడీ క్యూ8 (Audi Q8) వంటి అత్యంత ఖరీదైన మోడళ్లు ఉన్నాయి. వీటితో పాటు టాటా హ్యారియర్, కియా సెల్టాస్, హ్యుందాయ్ క్రెటా వంటి పాపులర్ మోడళ్లను కూడా ఉద్యోగుల సీనియారిటీ మరియు అంకితభావాన్ని బట్టి పంపిణీ చేశారు. 1996లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం రిటైల్ స్పేస్ రంగంలో కేరళలోనే అగ్రగామిగా ఉంది. సంస్థను నమ్ముకుని దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హైలైట్ గ్రూప్ సీఈఓ అజిల్ ముహమ్మద్ మరో కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి సంస్థను మరింత విస్తరించి, అదనంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్, కాలికట్ ప్రాంతాల్లో విలాసవంతమైన మాల్స్ నిర్వహిస్తున్న ఈ సంస్థ, త్వరలోనే 680 మిలియన్ డాలర్ల వ్యయంతో భారీ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతోంది. ఉద్యోగులను గౌరవించే విషయంలో ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.








