AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“బుల్లెట్ దిగిందా.. లేదా?”: పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాస్ వార్నింగ్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పటాన్‌చెరు నియోజకవర్గం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వెళ్లి, మళ్ళీ వెనక్కి వస్తున్నట్లు సంకేతాలిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తన పట్టును నిరూపించుకున్నారు. నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్, తాజాగా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఇస్నాపూర్ మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం తర్వాత మహిపాల్ రెడ్డి ప్రత్యర్థులను ఉద్దేశించి “బుల్లెట్ దిగిందా లేదా” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫలితాలు చిత్రవిచిత్రంగా మారాయి. మొత్తం 26 వార్డులకు గాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో ఇరు పార్టీల బలం 13-13తో సమానమైంది. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎంట్రీ సీన్‌ను మార్చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు, బీఆర్ఎస్‌కు అనుకూలంగా తన ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో బీఆర్ఎస్ అభ్యర్థిని మోటే సుమలత చైర్‌పర్సన్‌గా విజయం సాధించారు.

ఈ అపూర్వ విజయం తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన మార్కు డైలాగులతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మరియు స్థానిక నేతలను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. “మేము ఎక్కడికి వెళ్లినా మా అడ్డా పక్కాగా ఉంటుంది” అని నిరూపించినట్లు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు బీజేపీ ఎంపీ మద్దతు ఇవ్వడం, మరోవైపు ఎమ్మెల్యే తన పాత గూటిలోనే పట్టు నిలుపుకోవడం చూస్తుంటే, పటాన్‌చెరులో గూడెం మహిపాల్ రెడ్డి హవా ఇంకా కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ANN TOP 10