తెలంగాణ అభివృద్ధి మరియు భవిష్యత్తు రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి. నాకు ఎవరూ పోటీ లేరు” అని స్పష్టం చేస్తూ, రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.
-
కేసీఆర్ జైలు అంశం: మాజీ సీఎం కేసీఆర్‌పై తమకు వ్యక్తిగత కక్ష లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, అక్రమాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిబంధనల ప్రకారమే కేసీఆర్‌ను జైలుకు పంపే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించారు.
-
కేంద్రంపై ప్రశ్నలు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మరియు ఫార్ములా ఈ-రేసు అక్రమాలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు. “సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారణకు పిలిచిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదు?” అని నిలదీశారు. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతానని చెప్పారు.
-
సింగరేణి బకాయిలు: సింగరేణి సంస్థకు ప్రభుత్వం ఉన్న బకాయిలు పదేళ్ల కేసీఆర్ హయాం నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్‌ను అడగని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడు తనను ప్రశ్నించడం ఏంటని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై కౌంటర్:
కాంగ్రెస్ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇతరుల ఫోన్ సంభాషణలు వినడం ఒక మానసిక రోగమని, అలా చేస్తే ఆయుష్షు తగ్గుతుందని గత పాలకులపై సెటైర్లు వేశారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలో బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే తాము ముందుకెళ్తామని వివరించారు.








