ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాల్లోనే అమరావతికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ఏపీకి రావలసిన పెండింగ్ నిధులు మరియు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో కేంద్రం సహకారంపై అమిత్ షాతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ను శాశ్వతంగా ఎత్తివేయాలని, రెండో దశ పనుల కోసం రూ.32,000 కోట్ల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించేందుకు ఉద్దేశించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును జాతీయ నదుల అనుసంధాన విధానంలో చేర్చి సాంకేతిక, ఆర్థిక మద్దతు ఇవ్వాలని కోరారు.
నదీ జలాల వివాదాలపై కూడా ముఖ్యమంత్రి కేంద్రానికి స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల ఏపీకి దిగువ ప్రవాహ జలాలు తగ్గుతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఏపీ-తెలంగాణ మధ్య గోదావరి నీటి పంపకాల కోసం తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, ఒడిశాతో ఉన్న వంశధార వివాదాన్ని పరిష్కరించి నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చంద్రబాబు వెంట ఉన్నారు.








