ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 10 గంటలకు అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం గత కొద్ది నెలలుగా సాధించిన ప్రగతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు. సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది.
ప్రతిపక్ష వైసీపీ ఈసారి అసెంబ్లీ సమావేశాల విషయంలో ఒక విభిన్నమైన వ్యూహాన్ని అమలు చేయబోతోంది. మొత్తం సమావేశాలకు హాజరు కాకుండా, కేవలం రేపు ఒక్క రోజే (బుధవారం) సభకు రావాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా, ఎమ్మెల్యేగా తన అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ’60 రోజుల నిబంధన’ దృష్ట్యా హాజరు నమోదు చేసుకోవడం ఒక కారణమైతే.. తిరుమల లడ్డూ వివాదం, అంబటి రాంబాబు అరెస్టు మరియు రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలపై గవర్నర్ ప్రసంగం సమయంలోనే నిరసన తెలపాలని వైసీపీ భావిస్తోంది.
మరోవైపు, అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) కూడా ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ పారిపోతోందని ఎండగట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అమరావతి నిర్మాణం మరియు సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.








