నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ప్రారంభమైన ఈ మంటలు వేగంగా వ్యాపించడంతో ల్యాబ్‌లోని కీలకమైన ఫైళ్లు, రికార్డులు కాలిబూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు, ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో పొగ పీల్చిన కొందరు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అయితే, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రచారం జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. ఇది ప్రమాదం కాదు, సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ‘ఓటుకు నోటు’ కేసులోని వాయిస్ రికార్డింగ్‌లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సృష్టించిన తప్పుడు ఆధారాలు బయటపడకుండా ఉండేందుకే ఈ నాటకానికి తెరతీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి సాక్ష్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ వంటి అత్యంత భద్రత ఉండాల్సిన చోట అగ్నిప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదాన్ని సృష్టించిందా? లేక నిజంగానే సాంకేతిక కారణాలతో జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. కాలిపోయిన ఫైళ్లలో ఏయే కేసులకు సంబంధించిన వివరాలు ఉన్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ల్యాబ్ పరిసరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.









