హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి భక్తుడు తన మౌనాన్ని వీడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దేవుడిపై కేవలం భక్తి ఉంటే సరిపోదని, ఆ భక్తికి రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. మన ఆరాధ్య దైవాలను లేదా ధర్మాన్ని ఎవరైనా అవహేళన చేసినప్పుడు బాధపడుతూ మౌనంగా ఉండిపోవడం ఇకపై సరికాదని, ప్రతి ఒక్కరూ తమ నిరసనను గళమెత్తి చాటాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ పోస్ట్‌లు చేశారు.
మనం కులాలు, ప్రాంతాలు, భాషల పరంగా విడిపోయి ఉండవచ్చు కానీ, మన ధర్మం మరియు ఆరాధ్య దైవాలు ఒక్కటేనని పవన్ గుర్తుచేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హిందూ విశ్వాసాలను అవమానించినప్పుడు భక్తులు స్పందించకపోవడం వల్ల ధర్మం బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తులు కేవలం ఆరాధకులుగానే కాకుండా, తమ విశ్వాసానికి రక్షకులుగా మారాలని ఆకాంక్షించారు. మౌనం అనేది చేతకానితనం కాకూడదని, ధర్మ రక్షణలో వెనకడుగు వేయవద్దని ఆయన హెచ్చరించారు.
అయితే, ఈ ధర్మ పరిరక్షణ ఉద్యమం ఏ ఇతర మతానికి వ్యతిరేకం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరినీ తక్కువ చేయడం లేదా ద్వేషించడం సనాతన ధర్మం ఉద్దేశం కాదని, మన ధర్మం యొక్క గౌరవ మర్యాదలను కాపాడుకోవడం మాత్రమేనని వివరించారు. ‘వసుధైవ కుటుంబకం’ అనే గొప్ప సూత్రాన్ని బోధించే ధర్మాన్ని కించపరిచే వారి పట్ల వర్తమానంలో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆయన ‘వారాహి సనాతన ధర్మ రక్షణ వింగ్’ వంటి వేదికల ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.









