గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు, రాబోయే రెండేళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే గజ్వేల్ రూపురేఖలు మారాయని, ఒకప్పుడు పందుల నిలయంగా ఉన్న ఇక్కడి ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. మన సంక్షేమాన్ని కాంక్షించే వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని, అప్పుడే నిలిచిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయని గజ్వేల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని ఆశపెట్టి, ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి కేవలం తిట్ల పురాణం మాత్రమే తెలుసని, అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడే ధైర్యం ఆయనకు లేదని ఎద్దేవా చేశారు.
రైతు సంక్షేమంపై మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీలోపు రైతు బంధు నిధులు విడుదల చేయకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గత రెండున్నరేళ్లుగా గజ్వేల్‌లో ఎలాంటి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, కాంగ్రెస్ మరియు బీజేపీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. స్థానిక నాయకత్వాన్ని బలపరిచి గజ్వేల్ అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించాలని ఆయన ఓటర్లను కోరారు.








