AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగం: “ప్రభుత్వాలు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు”

మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. బుధవారం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదని, అధికారం అనేది అశాశ్వతమైనదని గట్టిగా గుర్తుచేశారు. ఈ రాజకీయ వ్యవస్థలో తాత్కాలిక విజయాల కంటే ప్రజాస్వామ్య విలువలకే ప్రాధాన్యత ఉండాలని ఆయన హితవు పలికారు.

తన ప్రసంగంలో కమల్ హాసన్ తన సినీ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చాలామంది నాయకులు వివిధ మార్గాల ద్వారా ఈ సభలోకి అడుగుపెడతారు, కానీ నాకు మాత్రం సినిమా ద్వారానే ఈ గౌరవం లభించింది” అని పేర్కొన్నారు. సినిమా తనను కేవలం నటుడిగానే కాకుండా, సమాజంలోని వాస్తవాలను గుర్తించే ఒక బాధ్యతాయుత పౌరుడిగా తీర్చిదిద్దిందని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, తన రాజకీయ ఆలోచనా సరళిపై పెరియార్, అన్నాదురై మరియు మహాత్మా గాంధీ వంటి మహనీయుల ప్రభావం ఎంతో ఉందని వివరించారు.

యువత భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ‘జెన్-జీ’ (Gen-Z) తరం రాజకీయ నాయకుల ప్రవర్తనను నిశితంగా గమనిస్తోందని కమల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్య రథం ప్రజల హక్కులను తొక్కివేయకూడదని, భేదాభిప్రాయాలను గౌరవిస్తూనే దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తమిళ భాష, సంస్కృతిపై జరిగే ఏ విధమైన దాడులనైనా ఎదిరించాలని అన్నాదురై తనకు నేర్పారని గుర్తుచేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, వారు ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో కలిసి ఎదిగేలా ప్రభుత్వాలు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10