కేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ సమగ్రంగా లేదని, యువత నిరుద్యోగులుగా మారుతున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. కేవలం విమర్శలు చేయడం కాదని, బడ్జెట్‌లో ఉన్న లోపాలను ఆధారాలతో సహా నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తోందని, ముఖ్యంగా నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలతో యువతను సిద్ధం చేస్తున్నామని, తయారీ రంగం పతనమవుతోందన్న విమర్శల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది అని ఆమె ఉద్ఘాటించారు.
మరోవైపు, రాహుల్ గాంధీ మాత్రం ఈ బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు ఉపసంహరణ, రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. కాగా, ప్రభుత్వం మాత్రం ఇది ‘యువశక్తి’ బడ్జెట్ అని, అభివృద్ధి చెందుతున్న లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించామని వాదిస్తోంది.








