లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శల దాడి పెంచారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం స్వచ్ఛందంగా జరిగింది కాదని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపెట్టి ప్రధానితో సంతకం చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాలో గౌతమ్ అదానీపై ఉన్న కేసు నిజానికి మోదీపై ఉన్న కేసు అని, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న కొన్ని రహస్యాల వల్ల ప్రధాని తీవ్ర ఒత్తిడిలో ఉండి ఈ ఒప్పందానికి లొంగిపోయారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్-అమెరికా ఒప్పందం వల్ల దేశీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అమెరికా వస్తువులపై సుంకాల (Tariffs) తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడం వంటి అంశాలపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఈ డీల్‌పై ప్రధాని హఠాత్తుగా సంతకం చేయడం వెనుక విదేశీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని, దేశ ప్రయోజనాల కంటే తన ప్రతిష్టను కాపాడుకోవడమే మోదీకి ముఖ్యం అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ చర్చల సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. డోక్లామ్ సరిహద్దు వివాదం మరియు ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని ప్రస్తావనలపై కూడా రాహుల్ మాట్లాడటంతో అధికార పక్షం తీవ్రంగా నిరసన తెలిపింది. సభకు అంతరాయం కలిగించారనే కారణంతో తెలంగాణ ఎంపీ చామల కిరణ్‌తో సహా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా ఒప్పందంలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.









