ముద్రగడ పద్మనాభం తన లేఖలో రాష్ట్రంలో “రాక్షస పాలన” సాగుతోందని విమర్శించడమే కాకుండా, కాపు సామాజికవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలకు పంపించేయమని ప్రధానమంత్రిని కోరాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ముద్రగడ తన తండ్రి మాటలను లేఖలో ప్రస్తావించడంపై స్పందిస్తూ, “అవసరమైనప్పుడు మాత్రమే కులం గురించి మాట్లాడమని మీ తండ్రి చెప్పారా?” అని ప్రశ్నించారు. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తల్లిని, భార్యను వైఎస్సార్సీపీ నేతలు కించపరిచినప్పుడు ముద్రగడకు తన కులం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అలాగే కాపు నేత నారాయణపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ముద్రగడకు చంద్రబాబుపై ఉన్న ద్వేషం వెనుక కారణమేంటని వెంకన్న అడిగారు. 1994లో ఎన్నికల్లో ఓడిపోయిన ముద్రగడను, 1999లో చంద్రబాబు పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబును గొప్ప నాయకుడని పొగిడిన ముద్రగడ, ఇప్పుడు అదే చంద్రబాబు భార్యను అసెంబ్లీలో అవమానించినప్పుడు జగన్‌కు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. అంబటి రాంబాబు వంటి వారు వాడిన బూతు మాటలను, జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై చేసిన దాడిని ముద్రగడ సమర్థిస్తున్నారా అని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఒక కులానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని, ఆయన ప్రపంచం గుర్తించిన అరుదైన నాయకుడని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. కేవలం అసూయతో ఇటువంటి లేఖలు రాయడం మానుకోవాలని, వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ప్రజలు చంద్రబాబు పాలనను కోరుకుని ఆయన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారని, ఇప్పటికైనా ముద్రగడ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.









