AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడారం జాతర వేళ మున్సిపల్ ఎన్నికలా? ఎన్నికల సంఘం తీరుపై దాసోజు శ్రవణ్ నిప్పులు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షెడ్యూల్, నోటిఫికేషన్ మధ్య కనీసం ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్‌కు బహిరంగ లేఖ రాస్తూ, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కోల్పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలా మారిందని ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభం లేకపోయినా ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన ‘మేడారం మహాజాతర’ను విస్మరించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. జనవరి 28 నుండి 31 వరకు కోట్లాది మంది భక్తులు వనదేవతల దర్శనానికి వెళ్లే సమయంలో, సరిగ్గా అప్పుడే (జనవరి 28-30) నామినేషన్ల ప్రక్రియ ఉంచడం వెనుక ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్ర ఉందని దుయ్యబట్టారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తూ, పండుగ వేళ రాజకీయ హడావుడి చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఈ షెడ్యూల్ వల్ల కొత్త అభ్యర్థులకు, మహిళలకు మరియు ప్రతిపక్షాలకు తగినంత సమయం లభించదని, ఇది కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకేనని వాదించారు.

తక్కువ సమయం ఇవ్వడం వల్ల ఎన్నికలు కేవలం మద్యం, డబ్బు, కండబలంతో నడిచే ‘మేనేజ్డ్ డ్రామా’గా మారే ప్రమాదం ఉందని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని ఈ ఏకపక్ష షెడ్యూల్‌ను పునఃసమీక్షించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా తగినంత సమయం కేటాయించాలని ఆయన తన లేఖలో కోరారు.

ANN TOP 10