బిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తన సోదరుడి వరుసయ్యే సంతోష్ రావుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ చుట్టూ ఉన్న “దెయ్యాల్లో” మొదటి దెయ్యం సంతోష్ రావేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను బాహ్య ప్రపంచానికి, ఉద్యమ నేతలకు, చివరకు సొంత కుటుంబ సభ్యులకు కూడా దూరం చేసింది ఆయనేనని మండిపడ్డారు. గద్దర్ వంటి ప్రముఖులు ప్రగతి భవన్ గేటు వద్ద గంటల తరబడి వేచి ఉన్నా లోపలికి రానివ్వలేదని, ఈటల రాజేందర్ వంటి నేతలు పార్టీని వీడటానికి కూడా సంతోష్ రావు సృష్టించిన ఆ “ఇనుప గొలుసు” కోటరీయే కారణమని కవిత ఆరోపించారు.
మరింత ఘాటుగా స్పందిస్తూ, సంతోష్ రావు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నారని కవిత విమర్శించారు. కేసీఆర్ ఆహారపు అలవాట్ల నుండి రాజకీయ వ్యూహాల వరకు ప్రతి చిన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అర ఇడ్లీ తిన్నారా లేక పూర్తి ఇడ్లీ తిన్నారా అనే సమాచారం కూడా సీఎంకు అందుతోందని, ఇలాంటి వ్యక్తుల వల్లే పార్టీకి, కుటుంబానికి తీరని నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో తనకు పార్టీ నుండి ఆశించిన మద్దతు లభించకపోవడం వెనుక కూడా సంతోష్ రావు హస్తం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, కవిత చేసిన ఈ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేయడం ద్వారా పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని కొందరు నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ వివాదంపై స్పందించవద్దని పార్టీ అధిష్టానం ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు గులాబీ పార్టీలో మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.









