భారతదేశం మరియు ఇరాన్ మధ్య ఉన్న చారిత్రక బంధంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇరుదేశాల మధ్య స్నేహం కేవలం వందల ఏళ్ల నాటిది కాదని, అది దాదాపు 3,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినదని ఆయన స్పష్టం చేశారు. చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలే ఈ బంధానికి బలమైన పునాది అని, భారత్‌తో పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఖమేనీ ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై ఇరాన్ పూర్తి విశ్వాసంతో ఉందని అబ్దుల్ మాజిద్ తెలిపారు. ఇతర దేశాలు విధించే ఆంక్షలు భారత్-ఇరాన్ సంబంధాలను ఎప్పుడూ ప్రభావితం చేయలేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాచీన కాలం నుంచి భారతీయ తాత్విక గ్రంథాలు, వైద్యం, ఖగోళశాస్త్రం మరియు గణిత శాస్త్రాల్లోని విజ్ఞానాన్ని ఇరాన్ విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేస్తున్నాయని, నేటికీ ఆ అనుబంధం కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్‌పై అంతర్జాతీయ సంస్థలు కొన్నిసార్లు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఇటీవల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఇరాన్‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానంపై భారత్ వ్యవహరించిన తీరును ఇరాన్ ప్రతినిధి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేయడంపై ఇరాన్ రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవడం ఇరుదేశాల పరిణతికి నిదర్శనమని, భవిష్యత్తులో వాణిజ్య మరియు వ్యూహాత్మక రంగాల్లో కలిసి ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









