ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో దొంగలు అత్యంత సాహసోపేతమైన దొంగతనానికి పాల్పడ్డారు. ధోధిపారా ప్రాంతంలో హస్డియో లెఫ్ట్ కెనాల్‌పై సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన 70 అడుగుల పొడవైన స్టీల్ వంతెనను రాత్రికి రాత్రే మాయం చేశారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వంతెన నిర్మాణాన్ని ముక్కలుగా కట్ చేసి తరలించారు. జనవరి 18న వంతెన కనిపించకపోవడంతో స్థానిక కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో ఈ చోరీ వెనుక 15 మంది సభ్యుల ముఠా ఉన్నట్లు తేలింది. వంతెన బరువు సుమారు 10 టన్నుల కంటే ఎక్కువ ఉంటుందని, దీన్ని స్క్రాప్ (ఇనుప పాత సామాను) కింద అమ్మి సొమ్ము చేసుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు నిందితులు అంగీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో 10 మంది కోసం గాలిస్తున్నారు. దొంగలించిన ఉక్కులో 7 టన్నులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దొంగలు ఈ భారీ ఉక్కును కాల్వ లోపలే దాచి ఉంచారు.
ఈ సంఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాత వంతెన కావడంతో అధికారుల నిర్లక్ష్యం కూడా దీనికి ఒక కారణమని విమర్శలు వస్తున్నాయి. చోరీకి వాడిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ముఖేష్ సాహు, అస్లాం ఖాన్ అనే వ్యక్తులు ఈ ముఠాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ప్రజలు తిరిగే పాదచారుల వంతెననే దొంగలు ఇలా మాయం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.









