తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అత్యంత సంచలనం సృష్టించిన రూ. 3.90 కోట్ల కుంభకోణాన్ని వరంగల్ పోలీసులు రట్టు చేశారు. ధరణి మరియు భూభారతి రిజిస్ట్రేషన్ పోర్టల్స్‌లోని సాంకేతిక లోపాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితులు పసునూరి బసవరాజు, జెల్లా పాండు సహా మరో తొమ్మిది మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 63 లక్షల నగదుతో పాటు కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా అనుసరించిన మోసం పద్ధతి అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నడుపుతున్న నిందితులు, వెబ్‌సైట్‌లోని ‘ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్’ (Inspect Element) మరియు ‘ఎడిట్ అప్లికేషన్’ వంటి టెక్నికల్ ఆప్షన్లను వాడి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ ద్వారా తగ్గించేవారు. రైతుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం వందల్లో చెల్లించి నకిలీ రసీదులు సృష్టించేవారు. ఈ నకిలీ చలాన్లతోనే ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించేవారు. ఇప్పటివరకు జనగామ, యాదాద్రి జిల్లాల్లో సుమారు 1,080 డాక్యుమెంట్ల విషయంలో ఈ అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ భారీ కుంభకోణంపై వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నిందితులపై ఇప్పటికే 22 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మధ్యవర్తులు, మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు కలిసి 10 నుంచి 30 శాతం కమిషన్ల కోసం ఈ ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని తెలిపారు. రైతులు భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో మధ్యవర్తులను నమ్మవద్దని, తాము చెల్లించిన చలాన్ల అసలైన రసీదులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సరిచూసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాన్ని ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.









