AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్‌కు మసూద్ అజర్ ఉగ్ర హెచ్చరికలు: వెయ్యి మంది సూసైడ్ బాంబర్లు సిద్ధమంటూ ఆడియో వైరల్!

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ తాజాగా భారత్‌పై విషం చిమ్మాడు. తన వద్ద వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి (సూసైడ్) బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారు ఏ క్షణమైనా భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి ఎదురుచూస్తున్నారని ఒక ఆడియో సందేశంలో హెచ్చరించాడు. తాను గనుక బాంబర్ల పూర్తి సంఖ్యను వెల్లడిస్తే అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతుందని, తన అనుచరులు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో అతడు వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజర్ బంధువులు, సన్నిహితులు సహా 11 మంది హతమయ్యారు. ఈ పరాభవాన్ని తట్టుకోలేక, దానికి ప్రతీకారంగానే మసూద్ అజర్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక కూడా జైషే మహ్మద్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడ్డ నిందితుడు ఉమర్ మహమ్మద్‌కు ఈ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మసూద్ అజర్ ఆచూకీపై స్పష్టత లేనప్పటికీ, అతడు పాకిస్తాన్‌లోని రహస్య ప్రదేశం నుంచే భారత్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నాడని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు భద్రతా సంస్థలు దేశవ్యాప్తంగా ‘హై అలర్ట్’ ప్రకటించి నిఘాను ముమ్మరం చేశాయి.

ANN TOP 10