తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సీనియర్ నాయకులైన పొంగులేటి, జూపల్లి .. బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఇద్దరూ పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ… బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సమయం వచ్చినప్పుడల్లా అధిష్టానంపై అసమ్మతిని వెల్లగక్కారు. తిరుగులేని నాయకుడిగా, ప్రజల పక్షాన ఉంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి తనకంటూ ప్రత్యేక ప్రస్థానం స్థాపించుకున్నారు. తొలుత కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి .. 2014లో గులాబీ వారి ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. కానీ తర్వాత వచ్చిన 2018 ఎన్నికల్లో అధిష్టానం పొంగులేటికి కానీ ఆయన అనుచరులకు గానీ పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదు. అంతేకాదు తెలంగాణలో ఉద్యమకారులకు, పార్టీకి కట్టుబడి ఉన్నవారికి, ప్రజల పక్షాన మాట్లాడిన వారికి స్థానం లేదని.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆశయాలు నెరవేరలేదని ఆయన అవేదన చెందారు. అదేవిధంగా ప్రజావ్యతిరేకమైన పార్టీ నిర్ణయాలను అంగీకరించలేక బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తన అనుచరులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి..తన సైన్యాన్ని పోగు చేసుకుంటున్నారు. సమ్మేళనాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.అంతేకాదు ఆ మధ్యలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొంగులేటిని కలవడంతో, పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరతారనే పుకార్లు దుమారం రేపాయి. ఇదంతా అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేక.. పొంగులేటిని దూరం చేసుకోలేక గులాబీ నాయకులు సైలెంట్ అయ్యారు.
ఇంకోవైపు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన బీరం హర్షవర్ధన్ రెడ్డితో తనకు కొంతకాలంగా విభేధాలు సాగుతున్నాయి. పార్టీ తనను పట్టించుకోవడం లేదని బహిరంగంగా చెప్పుకొచ్చారు జూపల్లి. ఈ క్రమంలోనే ఆయన కొల్లపూర్ లో అసమ్మతి నేతలను ఏకం చేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా నిన్న కొత్తగూడెంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కొల్లపూర్ నుంచి పెద్ద ఎత్తున తన అభిమానులను తీసుకుని భారీ కాన్వాయ్ తో కొత్తగూడెం వెళ్లారు. ఈ సమ్మేళనంలో పొంగులేటి, జూపల్లి.. బీఆర్ఎస్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై, పోడు భూముల వ్యవహారంపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను కాపాడటంలో బీఆర్ఎస్ బిజీగా ఉందని మండిపడ్డారు. నెరవేరని హామీలతో ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని జూపల్లి ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరు లీడర్ల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.. నేడు వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై పొంగులేటి స్పందించారు. ఇన్ని రోజులకు తనకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషకరమని అన్నారు. దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
మరోవైపు.. ఈ ఇద్దరు నాయకులు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారానేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదైనా జాతీయ పార్టీలో చేరుతానని రెండు రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. అయితే.. ఆ జాతీయ పార్టీ కాంగ్రెస్సా, లేదా బీజేపీనా అనేది ఆసక్తికరంగా మారింది.









