చాలావరకు సినీ సెలబ్రిటీలు వివాదాలకు దూరంగా ఉంటారు. అది వారి కెరీర్‌ను, సినిమాలను ఎఫెక్ట్ చేస్తుందని భయపడతారు. కానీ ఈరోజుల్లో యంగ్ హీరోల్లో ఆ భయం కనిపించడం లేదు. అనిపించి అనిపించినట్టుగా మాట్లాడేస్తూ ఎవరైతే నాకేంటి అనే యాటిట్యూడ్‌తో ఉంటున్నారు. అలాంటి యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించి అలరించనున్న చిత్రమే ‘లైలా’. ఆ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. కానీ ఇంతలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయిన సీనియర్ నటుడు పృథ్వి వల్ల ఒక కాంట్రవర్సీ మొదలయ్యింది. ఆ కాంట్రవర్సీపై విశ్వక్ స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాయ్‌కాట్ లైలా
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్‌లో మూవీ టీమ్, క్యాస్ట్ అంతా పాల్గొన్నారు. ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూడా ఒక కీలక పాత్ర చేయడంతో ఆయన కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. మాట్లాడడానికి స్టేజ్ మీదకు పిలిచినప్పుడు సినిమా గురించి మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు పృథ్వి. అది వైఎస్ఆర్సీపీ సపోర్టర్లకు నచ్చలేదు. దీంతో వివాదం మొదలయ్యింది. ‘బాయ్‌కాట్ లైలా’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీనిపై స్పందించడానికి విశ్వక్ సేన్ స్పెషల్‌గా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు.
రెచ్చగొట్టే ఫోటో
విశ్వక్ సేన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ముందుగా పృథ్వి చేసిన వ్యాఖ్యలకు తన తరపున సారీ చెప్తున్నట్టుగా తెలిపాడు. ఆపై అసలు తన వ్యాఖ్యలకు, సినిమాకు సంబంధం లేదని, దాని వల్ల సినిమా ఎఫెక్ట్ అవ్వకూడదని వాపోయాడు. అందుకే ‘లైలా’ను బాయ్‌కాట్ చేయాలనే ట్రెండ్ ఆపేసి, అందరూ ఈ సినిమా చూడాలని కోరాడు. అలా ప్రెస్ మీట్‌లో విశ్వక్ కాస్త దురుసుగా మాట్లాడాడని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. ఇంతలోనే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ‘నేను అస్సలు పట్టించుకోను’ అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. దీంతో మొదలయిన వివాదాన్ని విశ్వక్ సేన్ మరింత ముదిరేలా చేస్తున్నాడని నెటిజన్లు ఫీలవుతున్నారు. కానీ అది కేవలం సినిమా పోస్టర్‌లో భాగమే అని విశ్వక్ మళ్లీ క్లారిటీ ఇచ్చాడు.
ప్రతీదానికి వివాదమే
విశ్వక్ సేన్ (Vishwak Sen) ఏ సినిమా చేసినా అది కచ్చితంగా కాంట్రవర్సీకి దారితీస్తుందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. తన ప్రతీ సినిమాకు ఏదో ఒక వివాదం వల్లే సరిపడా ప్రమోషన్స్ జరిగాయని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ‘లైలా’ విషయంలో కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి పబ్లిసిటీ చేయడం వల్ల, వివాదాన్ని మరింత రెచ్చగొట్టడం వల్ల కొంతవరకు ప్రమోషన్స్ జరిగినా.. అలాంటి స్టంట్స్ ఎక్కువకాలం ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేయలేవని కూడా ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ (Laila) మూవీ ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమయ్యింది.