శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రూ.7కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకొని.. వారిని అరెస్టు చేశారు. డ్రగ్స్ రవాణాపై డీఐఆర్ అధికారులకు ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. ఈ మేరకు అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చింది.
ఈ మేరకు అధికారులు లగేజీని తనిఖీ చేశారు. ఇందులో హైడ్రోపోనిక్స్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. 13 ప్యాకెట్లలో 7.096 కిలోల బరువున్న డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. ఎన్‌పీడీస్ చట్టం కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. హైడ్రోపోనిక్స్ గంజాయి కంటే ప్రమాదకరమైందని.. డ్రగ్స్ కంటే విలువైందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే కొద్ది దేశాల్లో దొరుకుతుందని చెప్పారు.