AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాధితులకు న్యాయం జరిగితేనే పోలీసులపై నమ్మకం నిలబడుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ  పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో సీఐడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. తొలుత నిర్వహించిన పోలీస్ పరేడ్‌ లో భాగంగా  సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసులు హాజరయ్యారు.

ఆలిండియా మీట్ ఎక్కడంటే…

అనంతరం విజేతలకు ట్రోఫీలను బహురించారు. అంతకుముందు సైబర్ క్రైమ్ కి సంబంధించిన హ్యాండ్‌బుక్‌ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వచ్చే జనవరిలో రాంచీలో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్‌ మీట్‌లో విజేతలు పాల్గొనున్నారు. వివిధ శాఖలకు చెందిన పోలీసు బృందాలు పాల్గొన్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్లకు మొదటిసారిగా ఈ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం గమనార్హం. ఫలితంగా పోలీస్‌ అధికారులు నాలుగు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ మీట్ లో భాగంగా 26 పోలీస్‌ విభాగాల నుంచి 13 బృందాలు పలు ఈవెంట్లను నిర్వహించాయి. సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, డాగ్‌ స్క్వాడ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, ఫొటో, వీడియోగ్రఫీ లాంటి పోటీలను పోలీస్ డ్యూటీలో భాగంగా నిర్వహించారు.

పోలీస్ పిల్లల కోసం త్వరలోనే ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్ణీత ప్రమాణాలతో మొదలవుతుందన్న సీఎం,  తొలి విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రారంభిస్తామన్నారు.

ఇక పోలీసుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పోలీస్ అంటే ఉద్యోగం కాదని అదో భావోద్వేగం అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోలీసులకు సైతం ప్రత్యేక స్థానం ఉందని ఆయన గుర్తుచేశారు. ఇందుకు కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగమే గొప్ప ఉదాహారణ అన్నారు.

ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు, 2013 నుంచి 2024 కాలంలో పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి డ్యూటీ మీట్ ఇదేనన్నారు.

ANN TOP 10