తెలంగాణలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భారీ విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్ తరఫున శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని కలిసి ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి రూ.100 కోట్ల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ తదితరులు సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించింది.
భవిష్యత్తులో కూడా..
సమావేశం అనంతరం గౌతమ్ అదానీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చొరవతో రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఈ క్రమంలో యువత భవిష్యత్తును రూపొందించడం మాత్రమే కాదు.. ప్రకాశవంతమైన, సంపన్నమైన భారతదేశం కోసం అనంతమైన సామర్థ్యాన్ని, రాబోయే తరాలను ఇక్కడ సృష్టించనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మరింత మద్దతు ఇస్తామని అదానీ హామీ ఇచ్చారు.









