కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అభ్యర్థనకు నిరాకరణ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్ర హైకోర్టు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. రేవంత్ తరఫున న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. ఈ కేసును వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారనే అపోహలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ ను ఎంటర్‌టైన్ చేయలేమని స్పషం చేసింది.
అపోహ తప్ప ఆధారాల్లేవ్..
విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని కోర్ట్ వ్యాఖ్యానించింది. విచారణ జరుగుతున్న ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోచేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని కూడా కోర్ట్ ఆదేశించింది. సీఎం, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని పేర్కొంది.
పారదర్శకంగా విచారణ..
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కినట్టయింది.
కీలక సూచనలు
సుప్రీకోర్టు ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని ఈ సందర్భంగా హితబోధ చేసింది.









