రాజధాని పరిధిలోని కబ్జాదారులు, ఆక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా చర్యలను సామాన్యులు, మేధావులు, పర్యావరణ వేత్తలు స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైడ్రా సంస్థ చర్యలను అభినందించి, ఆ సంస్థ అభివృద్ధి కొరకు తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలను కేటాయిస్తున్నట్లు లేఖను అందజేశారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు కూడా ఇదే రీతిన స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టాలని పోలీసు శాఖను కోరినట్లుగా తెలిపారు. తన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ హైదరాబాద్‌ను అమెరికా చేసినట్లు గొప్పలు చెప్పిందని కానీ, నగరంలో కబ్జాకు గురైన భూముల్లో మెజారిటీ ఆ పార్టీ నేతలు చేసినవేనని విమర్శించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు వచ్చినా.. ముందుకే సాగుతున్నామని రంగనాథ్ తనతో చెప్పినట్లు ఆయన వెల్లడించారు.









