AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరో నాగార్జునకు భారీ షాక్‌.. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చేసిన హైడ్రా

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సినీనటుడు నాగార్జునకు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని ఆరోపణలు తీవ్రమయ్యాయి. గడిచిన వారంరోజులుగా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు.

నోటీసు ఇచ్చి..
అధికారులు తొలుత నోటీసులు ఇచ్చారు. అనంతరం శనివారం ఉదయం కూల్చివేత మొదలుపెట్టారు. దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి. కన్వెన్షన్‌ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

అక్రమ కట్టడాలపై కొరడా
హైదరాబాద్‌ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. ఈ క్రమంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది. చాలాప్రాంతాల్లో పలు భవనాలను కూల్చివేసింది హైడ్రా. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారు. చెరువుకు సంబంధించి దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేశారని గతంలో ఫిర్యాదులు అధికారులకు వెళ్లాయి. సీఎం కేసీఆర్‌ ఉన్న సమయంలో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేయాలని అధికారులు భావించారు. తెల్లవారితే దాన్ని కూల్చివేయాలని బుల్డోజర్లను మొహరించారు అధికారులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ సైలెంట్‌ అయ్యింది.

తాజాగా ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో మాదిరిగానే పరిస్థితులు పునరావృతమవుతాయని వార్తలు వచ్చాయి. ఇవేమీ హైడ్రా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసుల బందోబస్తు మధ్య ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేశారు.

ANN TOP 10