(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు. అక్టోబర్‌లో జరగనున్న ‘అలయ్–బలయ్’ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందించారు.
అలయ్–బలయ్‌కి ఐకాన్..
అలయ్–బలయ్ కార్యక్రమం పేరు చెప్పగానే దీనికి బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ కూడా. తెలంగాణ సంస్కృతి– సంప్రదాయాలను చాటి చెప్పాలనే ఉద్దేశంతో 17 ఏళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. ఎప్పుడు, ఎక్కడ.. ఏ పదవిలో ఉన్నా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది ఆయన నిర్వహిస్తుంటారు.
ఇందులోభాగంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు గవర్నర్ బండారు దత్తాత్రేయ. తొలుత సీఎంను శాలువాతో సత్కరించారు గవర్నర్. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్–బలయ్’ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. అందుకు సరేనని ముఖ్యమంత్రి చెప్పారు.
నార్మల్‌గా ఇద్దరు కీలక రాజకీయ నేతలు కలిస్తే.. రాజకీయాల గురించి మాట్లాడు కోవడం సహజం. సీఎం రేవంత్‌రెడ్డి–గవర్నర్ బండారు దత్తాత్రేయ మధ్య రాజకీయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై చర్చించుకున్నారు. మొత్తానికి ఇద్దరు కీలక నేతలు కలవడంతో ఏం మాట్లాడుకున్నారనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.









