AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్‌.. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
8 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రంగారెడ్డి జిల్లాలో ఘటన

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 8 లక్షలు డిమాండ్‌ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఉన్నత హోదాలో కొనసాగుతూ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపుతోంది. గత రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌ నుంచి తొలగించేందుకు..
జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్‌ సైట్‌లో ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌ నుంచి తొలగించాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే అందుకు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మెహన్‌ రెడ్డి రూ. 8 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముత్యంరెడ్డి నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అడ్డంగా దొరికిపోయిన మదన్‌.. జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చాడు. జాయింట్‌ కలెక్టర్‌ చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు. దాంతో తమ ముందే ఏసీబీ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేయించారు.. మదన్‌ మోహన్‌ జాయింట్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి తాను ముత్యం రెడ్డి డబ్బులు తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఆ డబ్బును తీసుకొని పెద్ద అంబర్‌ పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫోన్‌లో మదన్‌ మోహన్‌కు సూచించాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఏసీబీ అధికారులు పెద్ద అంబర్‌పేట వద్ద జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డికి మదన్‌ మోహన్‌ డబ్బులు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాగోల్‌లోని భూపాల్‌ రెడ్డి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా కొంత మెుత్తంలో డబ్బు దొరికినట్లు తెలిసింది. ఈ మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ANN TOP 10