తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బేగంపేట నుంచి రాజ్ భవన్ మార్గంలో ఈరోజు రాత్రి, రేపు ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈరోజు రాత్రి 7.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రాజ్ భవన్‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతించరు.
రేపు ఉదయం రాజ్ భవన్ నుంచి తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు పీఎం మోదీ వెళ్లనున్నారు. దీంతో రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వరకు పెహికిల్స్ ని అనుమతించరు. ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనరులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.









