హైదరాబాద్: మండే ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు బేగంపేట వాతావరణ శాఖ(IMD) చల్లటి కబురు చెప్పింది. మే 7, 8 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటలకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు. రెండు రోజులపాటు గరిష్ఠంగా 39, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.
సోమవారం చందానగర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 12 వరకు భాగ్యనగరంలో వాతావరణం చల్లగా ఉంటుంది. నిన్న మూసాపేటలో 43.7 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌లో 43.5 డిగ్రీలు, షేక్ పేటలో 43.4 డిగ్రీలు, బీహెచ్ఈఎల్‌లో 43.3, రాజేంద్రనగర్‌లో 43.3, లంగర్ హౌజ్‌లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో చల్లటి గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో భాగ్యనగర ప్రజలు ఖుషి అవుతున్నారు.









