AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ పాలనలో అడ్డగోలుగా ధరలు పెరిగాయి.. ధ్వజమెత్తిన కేసీఆర్‌

కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్‌షోలో బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ పదేళ్లు అయ్యింది దేశానికి ప్రధాని అయి.. అచ్చేదిన్‌ వచ్చిందా? అచ్చేదిన్‌ రాలేదు..కానీ సచ్చేదిన్‌ మాత్రం వచ్చింది. అడ్డగోలు ధరలు పెరిగిపోయాయి. అమృత్‌ కాల్‌ వచ్చిందా? బేటీ పడావో.. భేటీ బచావో వచ్చిందా?’ అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘జన్‌ధన్‌ ఖాతాలో డబ్బులు పడ్డయా? జగిత్యాలలో రూ.15లక్షలు వచ్చినయటకదా? మోదీ వచ్చినయని చెబుతున్నడు. జగిత్యాలలో ఎవరికీ రాలేదా?’ అని అనగా.. ‘రాలేదు’ అని చెప్పారు. ‘ఇవాళ భారతదేశ రూపాయి విలువ డాలర్‌కు వ్యతిరేకంగా చూస్తే.. చాలాహీనంగా రూ.84కి పడిపోయింది. ఎగుమతులు బంద్‌ అయ్యాయి. దిగుమతులు పెరిగాయి. దేశానికి వందలక్షల కోట్ల అప్పు పెరిగింది. ఏ ఒక్క వర్గానికి కూడా మోదీ హయాంలో న్యాయం జరుగలేదు’ అన్నారు.

‘మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని పుట్టించి.. దాదాపు ఆరేడు సంవత్సరాల్లో రైతుల ఖాతాల్లో వేసినం. రైతుబంధు రైతులందరికీ? ఏం పడాలి. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి.. మేం రైతుభరోసా ఇస్తం. రూ.7500 ఇస్తం.. సంవత్సరానికి రూ.15వేలు ఇస్తం అన్నరు’ మరి రూ.15వేలు ఇచ్చారా? అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘మొదటి రూ.5వేలే దిక్కులేవు. రేపు మేం పొలం దున్నినోనికే వేస్తం.. చేసిన వాళ్లకే వేస్తం. ఐదెకరాలకు పరిమితం పెడతాం అంటున్నరు. లిమిట్‌ పెడతా అంటే 20-25 ఎకరాలకు పెట్టాలి. ఐదారు, ఐదెకరాలు, ఎనిమిదెకరాల రైతులు ఏం తప్పు చేశారు. యాసంగి వడ్లన్నీ కొంటున్నరా? నేను వస్తుంటే రోడ్డుపొంట చూసిన ఎక్కడికుప్పలు అక్కడే ఉన్నయ్‌. రూ.500 బోనస్‌ వడ్లకు వచ్చిందా? బోనస్‌ అయ్యిందా? అంటూ విమర్శించారు.

జగిత్యాలలో రెండు తులాల బంగారం వచ్చిందట కదా?
‘కల్యాణలక్ష్మి పథకంలో కేసీఆర్‌ రూ.లక్ష ఇస్తున్నడు. మేం తులం బంగారం కూడా ఇస్తామన్నరు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా?’ అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘మీరంతా అబద్ధం చెబుతున్నరు. జగిత్యాలలో రెండు తులాల వచ్చిందటకదా?’ అని కేసీఆర్‌ అన్నారు. ‘బంగారం కూడా లేదు. తులం బంగారం తుస్సుమన్నది. మొత్తానికే అరచేతిలో వైకుంఠం చూపించి.. చాలా బ్రహ్మాండంగా మోసగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం’ అంటూ మండిపడ్డారు.

ANN TOP 10