ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి పోరాడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం అలంపూర్‌లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా నిర్వహించిన జన జాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, రాజ్యాంగాన్ని రక్షించే ఇండియా కూటమికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ఎన్డీఏ కూటమికి మధ్య జరుగుతోందన్నారు. రాజ్యాంగం వల్లే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతోందని, దాని ద్వారా దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువు పిల్చుకుంటున్నారని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రధాని మోడీ చించివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల అంశంపై సవాల్ చేశారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తామని ప్రధాని మోడీ హామీ ఇవ్వగలరా? అని సవాల్ విసిరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన, ఆర్థిక సర్వే చేస్తామన్నారు. 30 వేల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగుల కోసం ఇచ్చామని, రాష్ట్రంలో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. బీజేపీ పార్టీ 20 మంది బడా వ్యాపారుల కోసం పనిచేస్తోందని విమర్శించారు.
పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. పెద్దలకు బీజేపీ రుణమాఫి చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదని, రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. అదానీ, అంబానీలకు రూ. 16 లక్షల కోట్ల రూణాలు మాఫీ చేశారన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించబోతున్నామని భరోసా కల్పించారు. ఢిల్లీలో కూడా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.









