కాంగ్రెస్ హయాంలోనే అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని అన్నారు. గత ప్రభుత్వంలోనే అనేక అవినీతి ఉండేదని, అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోడీకి ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని బీజేపీ సరిదిద్దింది అని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మదిన్నరేళ్లు బీజేపీ పాలించిందని చెప్పారు. మరోసారి ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీ ఆశీర్వాదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మతకలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవని, తమ పాలనలోనే దేశం మొత్తం శాంతి నెలకొందన్నారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామని, ప్రస్తుతం ఆ దేశంలో తినడానికి తిండి లేక బిక్షమెత్తుకుంటోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించామని చెప్పారు. బీజేపీ హయాంలో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.









