హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఆరంగ్రేటం చేశారు. గత కొంత కాలంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని దేశ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. రాజకీయాల్లోకి ఎప్పుడేప్పుడు వస్తాడన్న ఉత్కంఠకు తెర తెంచారు. దళపతి విజయ్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్టీ జెండా, ఎజెండా త్వరలోనే ప్రకటిస్తానని విజయ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వబోమని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుందని విజయ్ అన్నారు. దీనిపై వ్యతిరేకంగా పోరాడేందుకు తను రాజకీయంలోకి వచ్చినట్లు చెప్పారు. కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలను తీసుకు రావడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకు రాజకీయ అధికారం కావాలని, అందుకే తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇవ్వమని, పోటీ కూడా చేయమని స్పష్టం వెల్లడించారు. 2026 జరిగే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, పార్టీ ఎజెండాకు సంబంధించిన విషయాలు త్వరలో వెల్లడిస్తానని విజయ్ తెలిపారు.
తమిళనాడులో ఇప్పటికే వందకు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం ప్రాధన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులు ఎప్పటి నుంచో విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఒక అభిమాన సంఘాన్ని నడుపుతున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున పోటీ చేసిన విజయ్ అభిమానులు 261 స్థానాలకు పోటీ పడగా 169 చోట్ల గెలుపొందారు. ఇక విజయ్ తన పార్టీలో కోటి మంది సభ్యులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పార్టీలో చేరాలనే వారి కోసం త్వరలో యాప్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.









