ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బీఆర్‌ఎస్ తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. మెనార్టీ బడ్జెట్ పెంపు హామీ ప్రకటించారు. తెలుపు రేషన్ కార్డు ఉన్న వారికి తీపికబురు అందించారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి భీమా స్కీమ్ ప్రకటించారు. దీని వల్ల 93 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. ఎల్ఐసీ ద్వారా బీమా అమలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వీరికి సన్న బియ్యం కూడా అందిస్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో గమనిస్తే.. ఇందులో సామాన్యులపై వరాల జల్లులు కురిపించారు. పలు కీలక ప్రకటనలు చేశారు. రైతులకు కూడా భారీ శుభవార్త అందించారు. రైతు బంధు స్కీమ్ కింద అందించే ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. రైతు బంధు రూ.16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీని వల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు మార్చి తర్వాత రూ.12వేలు.. క్రమంగా పెంచుతూ 5వ సంవత్సరం నిండే నాటికి.. రూ.16 వేలు అందిస్తామని వివరించారు.
అలాగే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కూడా తీపికబురు లభించింది. ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. కేవలం రూ.400కే సిలిండర్ అందిస్తామని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించింది. అర్హత కలిగిన వారికి ఈ బెనిఫిట్ లభించనుంది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్‌లకు కూడా రూ. 400కే సిలిండర్ లభిస్తుందని తెలిపారు. కాగా సిలిండర్ ధర ఇప్పుడు రూ.960 వద్ద ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పెన్షన్ తీసుకునే వారికి కూడా కేసీఆర్ భారీ ఊరట కల్పించారు. పెన్షన్ పెంచుతున్నట్లు వెల్లడించారు. రూ. 5 వేల వరకు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ పెంపు విడతల వారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏటా రూ.500 పెరుగుతుందని తెలిపారు.









