పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ఈ విషయం తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. ‘ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు అఖిలపక్ష ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన ఆహ్వానాలను సంబంధిత నేతలకు ఈ మెయిల్ ద్వారా పంపాం. లేఖలు కూడా వారికి చేరుతాయి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలతోపాటు అఖిలపక్ష సమావేశం అజెండా ఏమిటన్నది ఆయన స్పష్టం చేయలేదు.









