త్వరలో క్యాష్‌లెస్ జర్నీ
డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు
ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో చిల్లర ప్రధాన సమస్యగా ఉండేది. చిల్లర సమస్యలకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ రౌండ్ ఫిగర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంటే కనీస టికెట్ ధర రూ. 10 నుంచి రూ.15, 20, 25 ఇలా చిల్లర సమస్యలు రాకుండా ఛార్జీలను పెంచారు. అయినా ఈ సమస్యకు పరిష్కారం పూర్తిగా లభించలేదు.
దీంతో కొన్ని బస్సుల్లో ఐ-టిమ్స్‌ను ప్రవేశపెట్టారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఐ-టిమ్స్ ద్వారా నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీల ద్వారా టికెట్లు ఇస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం వంటి వాటితో చెల్లింపులు చేసి టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానాన్ని అన్ని రకాల బస్సుల్లో ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో అంటే పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ-టిమ్స్ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతోంది.
ఇప్పటికే బండ్లగూడ బస్‌డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్‌ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో టికెట్‌కు డబ్బులు అవసరం లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం వంటి వాటితో చెల్లింపులు చేసి టికెట్ ఇస్తున్నారు. టికెట్‌కు సరిపడా డబ్బులు ఇస్తే ఇచ్చినా టికెట్ తీసి ఇస్తారు. బండ్లగూడ అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ఐ- టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టేలా టీఎస్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించారు.









