గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. గద్వాల ఎమ్మెల్యేగా 2018లో ఎన్నికైన బీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని.. ఆయన ఎన్నికల నామినేషన్ సందర్భంగా తప్పుడు అఫిడవిట్ ను సమర్పించారని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ.. సీఈవోకు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణమోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా హైకోర్టు రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషనర్ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కృష్ణమోహన్ రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన అరుణను 2018 డిసెంబరు 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాటి ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున డీకే అరుణ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్ రెడ్డికి 1,00,057, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి.









