హిమాన్షు చేసిన వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు ఇచ్చిన స్పీచు గురించే చర్చ నడుస్తోంది. అయితే.. హైదరాబాద్ శివార్లలోని కేశవనగర్ సర్కారు స్కూల్‌ను కార్పొరేట్ పాఠశాల రేంజ్లో తీర్చిదిద్దటం గురించి మాట్లాడుకోవటం ఒకఎత్తైంతే.. ఆ స్కూల్ ప్రారంభోత్సవం రోజున హిమాన్షు ఇచ్చిన స్పీచ్ గురించి జోరుగా చర్చ జరగటం మరో ఎత్తు. కేశవనగర్ స్కూల్ దుస్థితి చూసి.. తనకు కన్నీళ్లొచ్చాయని.. ఇలాంటి స్కూళ్లు ఇంకా చాలా ఉన్నాయంటూ హిమాన్షు చెప్పటంతో.. విపక్షలు అదే మాటను పట్టుకున్నాయి. ప్రభుత్వ పని తీరును సీఎం కేసీఆర్ మనవడు తన మాటలతోనే స్పష్టంగా వివరించాడని పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. హిమాన్షు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని.. సరిగ్గానే చెప్పాడని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ సర్కారు బాగు చేస్తోందని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనతో రైతులకు కరెంటు, విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని.. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పుల్ని లైన్లో పెట్టి నిల్చున్నది నిజం కాదా అంటూ ఆనాటి పరిస్థితులను కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు.









