పలు సినిమాల్లోనూ కమెడియన్ టిల్లుగా అందరినీ నవ్వించాడు వేణు. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి తన కామెడీ డోస్‌ను మరింత పెంచాడు. అయితే ఉన్నట్లుండి జబర్దస్త్ ను వదిలేశాడు. ఏమైందో తెలియదు కానీ ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉండిపోయాడు. అయితే బలగం సినిమాతో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటివరకు కమెడియన్‌గానే మనకు తెలిసిన వేణు ఏకంగా డైరెక్టర్‌గా తన ట్యాలెంట్‌ను నిరూపించుకున్నాడు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ అతను తీసిన బలగం పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా వందకు పైగా అవార్డులు సొంతం చేసుకుంది.
తెలంగాణ పల్లెల్లో తెరలు ఏర్పాటుచేసుకుని మరీ ఈ సినిమాను వీక్షించారంటే బలగం ప్రేక్షకులకు ఎంతలా కనెక్టయ్యిందో ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తన రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు వేణు. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘1999లో కేవలం రూ.200తో హైదరాబాద్‌కు వచ్చాను. ఎన్నో కష్టాలు పడ్డాను. అయితే నా ఎప్పుడూ నా ఏకాగ్రతను కోల్పోలేదు. సినిమాలు తీయాలన్నదే నా ఏకైక లక్ష్యం. నేను చూడడానికి బాబు మోహన్‌లా ఉన్నాడని అనడంతో మొదట్లో కమెడియన్ అయ్యాను. ఇక జబర్దస్త్ షో వదిలేశాక సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అయితే అప్పుడే సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్ చేయాలనుకున్నాడు. బలగం సినిమా అలా పుట్టిందే. 2011లో నాన్న చనిపోయినప్పుడు సరైన సమయం లేక అన్ని ఆచారాలను చేయలేకపోయా. బలగం సినిమా కథ రాస్తున్నప్పుడు ఈ విషయం నాకు గుర్తొచ్చింది. అలాగే నాకు బాగా తెలిసిన ఓ ఫ్రెండ్ కూడా ఆ ఆచారాల గురించి చర్చించడంతో ఆ అంశంపైనే కథ రాసి సినిమా తీశా’ అని వేణు చెప్పుకొచ్చాడు.









