AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి (లష్కర్ బోనాలు) బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయ సిబ్బంది కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తెల్లవారుజామున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. వందల ఏళ్లుగా బోనాల పండగ కొనసాగుతోందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మహాంకాళి అమ్మవారిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేపు భవిష్యవాణి..
బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం జరగనుంది. అవివాహిత జోగిని ఈ భవిష్యవాణి వినిపించనున్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, పాలన, వర్షాలు, పాడి పంటలు ఎలా ఉంటాయో భవిష్యవాణి వినిపించనున్నారు. ఈ రంగం కార్యక్రమంలో గజరాజుపై అమ్మవారి ఊరేగింపు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ANN TOP 10