AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ నేత చంద్రశేఖర్‌ కీలక వ్యాఖ్యలు.. సొంత పార్టీపైనే విమర్శలు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్‌ సొంత పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతి గురించి మాట్లాడటం కాదు.. చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. అవినీతిపై చర్యలు తీసుకుంటేనే బీజేపీని ప్రజలు నమ్ముతారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో అందర్నీ అరెస్ట్ చేసి.. ఒకరిద్దరిని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న (శనివారం) వరంగల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యాలపై బీజేపీ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్ స్పందించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంలో హైకమాండ్ తప్పుచేసిందని చంద్రశేఖర్ అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర వలనే బీఆర్ఎస్‌ (BRS)కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ఎదిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రజల్లో జరగటానికి కారణం కూడా బండి సంజయ్ అన్నారు. గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా పార్టీని బలోపేతం చేస్తే.. ఎన్నికల ముందు బండిని తప్పించటం ఏంటని ఆయన నిలదీశారు. ఈటల రాజేందర్‌ కు ఇచ్చిన నామ్ కే వాస్తే పదవితో ఉపయోగం లేదన్నారు. లేని పదవిని సృష్టించి ఈటలకు పదవిని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ని డిమోషన్ చేసి.. ఆయనకు ఇష్టంలేని అధ్యక్ష పదవి ఇచ్చారని చంద్రశేఖర్ విమర్శించారు. అధ్యక్షుడి మార్పు వలన ఈటల సహా.. పార్టీలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా.. 3 సార్లు మంత్రిగా పనిచేసిన తనకు.. ప్రధానమంత్రి సభకు కనీసం పాస్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధానకార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నాయకత్వం తీరు మార్చుకోకుంటే తెలంగాణలో బీజేపీకి కష్టమేనని ఏ.చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

ANN TOP 10