తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గిరిజనోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. శనివారం రవీంద్ర భారతీలో గిరిజనులతో పెద్ద ఎత్తున సమావేశం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్వవతి రాధోడ్ , పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
రాష్ట్రంలోని ఆయా గిరిజన గ్రామాల్లో సభలు జరగనున్నాయి. గత తొమ్మిదేళ్ళలో గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రసావిస్తారు. హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం, కుమ్రంభీం జయంతి, సేవాలాల్ మహారాజ్ జయంతి, సమ్మక్క సారక్క జాతర, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును, వివిధ జాతరలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయం, తదితర వివరాలను ఈ కార్యక్రమంలో వెల్లడిస్తారు.









