ఇటీవల చెరువులో ఓ డ్రమ్ములో డెడ్‌బాడీ దొరికిన ఘటన సంచలనం రేపింది. కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణ గుట్ట పోలీసులు మర్డర్ కేసు మిస్టరీని ఛేదించారు. చాంద్రాయణగుట్టలో గత నెల 22వ తేదీన ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియురాలే అతడిని హత్య చేసిందని గుర్తించారు. ఓ మహిళ తన మరో ప్రియుడుతో కలిసి మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి ఆపై.. హత్య చేసి అనంతరం డెడ్‌బాడీని డ్రమ్ములో పెట్టి చెరువులో వేసిందని పోలీసుల విచారణలో తేలింది.
గత నెల 22 వ తేదీన పురాన్ సింగ్ అనే వ్యక్తి కనిపించకుండా పోయి దారుణ హత్యకు గురయ్యాడు. పురాన్‌సింగ్ హత్య వెనుక జయదేవి అనే మహిళ హస్తమున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం పురాన్ సింగ్‌పై హత్యా యత్నం జరిగింది. పురాన్ సింగ్, జయ దేవి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు. పురాన్ సింగ్ వచ్చేసి బండ్లగూడలోని పటేల్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. గతంలో అతను జయదేవితో ప్రేమ వ్యవహారం నడిపాడు.
అనంతరం జయదేవిని కాదని మరో యువతిని హైదరాబాద్‌కు వచ్చి పురాన్‌సింగ్ పెళ్ళి చేసుకున్నాడు. తనను పెళ్ళి చేసుకోలేదన్న కోపంతో పురాన్ సింగ్‌పై కక్ష తీర్చుకునేందుకు జయదేవి నగరానికి వచ్చింది. నగరంలో రాజస్తాన్‌కు చెందిన నజీమ్ ను ప్రేమించి అతని సహాయంతో పురాన్ సింగ్‌ను హత్య చేయించింది. కేసును విచారించిన పోలీసులు నిందితులైన జయదేవి, నజీమ్, సూగుణారామ్ లను అదుపులోకి తీసుకున్నారు.









